Telugubashasahityam's Blog

Just another WordPress.com site

పురాణములు సెప్టెంబర్ 20, 2010

Filed under: కవులు,రచయితలు ,వారి రచనలు — telugubashasahityam @ 11:43 సా.

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణమహర్షి కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

పురాణ వాఙ్మయం ఆవిర్భావం

“పురాణ” శబ్దానికి “పూర్వ కాల కథా విశేషం” అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకొంది కాని వేదవాఙ్మయ కాలానికే దీని మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్తు, గోపథ బ్రాహ్మణం వంటి గ్రంధాలలో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యంగా రూపుదిద్దుకొందని విమర్శకుల ఊహ. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరాళ వేళలలో ఇష్ట కధా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేతల కధలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యఙ్నాన్ని నిర్వహించే పండితులే ఈ కధాకాలక్షేపం జరిపి ఉండవచ్చును కాని ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు (క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన సంతానం) ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది.[1]

వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంధజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది. ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ క్రీ.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును[1].

ప్రణవం వేదాలు పురాణాల పుట్టుక

పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్ధం వెలువడింది. ఆ శబ్ధంలో నుండి కార కార కార శబ్ధాలు కూడిన ఓంకారశబ్ధం ఆవిర్భవించింది. “అ” నుండి “హ” వరకు గల అక్షరాలు ఆశబ్ధంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ ‘అ’కార, ‘ఉ’కార ‘మ’కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.
వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి

పురాణం లక్షణాలు

ప్రతి పురాణం కుడా పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలలో చెబుతుంది. కూర్మపురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతము ప్రకారం

సర్గశ్చప్రతిసర్గశ్చ వంశః మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం

సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.

 • సర్గము – సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది
 • ప్రతి సర్గము – సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)
 • వంశము – పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట
 • మన్వంతరము – ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట
 • వంశాలచరిత్ర

భాగవతంలో పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి

సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ
వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:

అనగా సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కధనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పదీ పురాణ లక్షణాలు. కొంతమంది ఇలా పది లక్షణాలున్నవి మహాపురాణాలని, ఐదు లక్షణాలున్నవి పురాణాలని వర్గీకరిస్తున్నారు.

పురాణాల విభజన

పురాణాల పేర్లు చెప్పే శ్లోకం

సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

పైన చెప్పిన వాటిలో:

 • “మ” ద్వయం — మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
 • “భ” ద్వయం — భాగవత పురాణం, భవిష్య పురాణం
 • “బ్ర” త్రయం — బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
 • “వ” చతుష్టయం — విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

 • అ — అగ్ని పురాణం
 • నా — నారద పురాణం
 • పద్ — పద్మ పురాణం
 • లిం — లింగ పురాణం
 • గ — గరుడ పురాణం
 • కూ — కూర్మ పురాణం
 • స్కా — స్కాంద పురాణం
అష్టాదశ పురాణములలో శ్లోకాలు [3]
 1. బ్రహ్మ పురాణం – బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.
 2. పద్మ పురాణం – బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.
 3. విష్ణు పురాణం – పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.
 4. శివ పురాణం – వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
 5. లింగ పురాణం – నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.
 6. గరుడ పురాణం – విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
 7. నారద పురాణం – నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
 8. భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
 9. అగ్ని పురాణం – భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
 10. స్కంద పురాణం – కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
 11. భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం – శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
 12. బ్రహ్మవైవర్త పురాణం – వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
 13. మార్కండేయ పురాణం – పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.
 14. వామన పురాణం – బ్రహ్మదేవుని రచన – 14,000 శ్లోకములు కలది.
 15. వరాహ పురాణం – శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
 16. మత్స్య పురాణం – శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
 17. కూర్మ పురాణం – శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
 18. బ్రహ్మాండ పురాణం – బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.
దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం

ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.

వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం
వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై
బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే
మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే

ఇలాంటిదే మరొక శ్లోకం

బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్
నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్
భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్

వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్

 

ఉపపురాణాలు

ఈ అష్టాదశపురాణాలే కాకుండా ఉపపురాణాలు కూడా ఉన్నాయి.అష్టాదశ పురాణాలు కాకుండా ఉన్న ఉపపురాణాలు

 1. సనత్కుమారీయము
 2. నారసింహము
 3. స్కాందము (కుమారస్వామి చే చెప్పబడినది)
 4. శివ ధర్మము (నందికేశ్వరుడి చేత చెప్పబడినది)
 5. నారదీయము(దూర్వాసునిచే చెప్పబడినది)
 6. కాపిలము
 7. వామనము
 8. బ్రహ్మాండ పురాణము (శుక్రచార్యులచే చెప్పబడినది)
 9. వారుణము
 10. కాలకము
 11. మహేశ్వరము
 12. సాంబము
 13. సౌరము
 14. మారీచము
 15. భార్గవపురాణము (పరాశరునిచేత చెప్పబడినది)
 16. కార్తీకపురాణం (స్కందపురాణంలో అంతర్భాగంగా చెప్పబడింది)
ప్రకటనలు
 

వ్యాసుడు

Filed under: కవులు,రచయితలు ,వారి రచనలు — telugubashasahityam @ 11:39 సా.

వేదాలను నాలుగు భాగాలు గా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడు గా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవత తో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు.

వేద వ్యాసుడు(చిత్ర పటము.)

జన్మ వృత్తాంతం

వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలొ పెక్కు మార్పు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది.

పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవి లో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు వేణుదుస్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పాడేస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువు కి కానుక గా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడు ని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి , ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండం గా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.

దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడ కు వస్తాడు.

అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది అనిజన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి గరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే , అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.

భారతంలో వ్యాసుని పాత్ర

వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరవాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది. వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుకారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరవాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మాత్రంచే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు. ఆతరవాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆతరవాత దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆ తరవాత లక్క ఇంటి దహనం తరవాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివశించిన ఆశ్రమప్రాంతంలో పాడవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రదమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలరచి సూచించి తనదారిని తాను వెళతాడు. ఆ తరవాత కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాందవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.

 

శ్రీ మదాంధ్ర మహాభారతం

Filed under: కవులు,రచయితలు ,వారి రచనలు — telugubashasahityam @ 11:35 సా.

మహా భారతం సంస్కృతంలో వేద వ్యాసుడు వ్రాసిన మహా కావ్యం. భారతీయ సాహిత్యం లోనూ, సంస్కృతిలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేద వ్యాసుడు వ్రాసిన ఈ ఉద్గ్రంధాన్ని ముగ్గురు మహాకవులు తెలుగులో కావ్యంగా వ్రాశారు. దానిని శ్రీ మదాంధ్ర మహాభారతం అని అంటారు. దీనిని తెలుగులో వ్రాసిన ముగ్గురు కవులు – నన్నయ, ఎర్రన, తిక్కన – వీరిని కవిత్రయం అంటారు. తెలుగు సాహిత్యంలో నన్నయ వ్రాసిన శ్రీ మదాంధ్ర మహాభారతము నకు “ఆదికావ్యం” అని పేరు. ఎందుకంటే అంతకు పూర్వం తెలుగులో గ్రంథస్థమైన రచనలు ఏవీ ఇప్పటికి లభించలేదు.

తెలుగులో ఆదికావ్యం

తెలుగులో నన్నయ ప్రారంభించిన మహాభారతమే ఆదికావ్యమా అనే విషయంపై అనేక సందిగ్ధాలున్నాయి. ఒక్కమారుగా అంతటి పరిణత కావ్యం ఉద్భవించదనీ, కనుక అంతకు ముందు తప్పకుండా కొన్నయినా పద్యరచనలు ఉండి ఉండాలని సాహితీచారిత్రికుల అభిప్రాయం. అయితే సూచన ప్రాయంగా పాటల, కవితల ప్రసక్తి (నన్నెచోడుడు) మరియు శాసనాలలో లభించే కొన్ని పద్యాలు తప్ప మరే రచనలూ లభించలేదు. కనుక నన్నయనే ఆదికవిగా తెలుగు సాహితీ ప్రపంచం ఆరాధించింది. ప్రాఙ్నన్నయ యుగం అధ్యాయాన్ని ముగిస్తూ ద్వా.వా.శాస్త్రి ఇలా వ్రాశాడు[1] – “మొత్తంమీద నన్నయకు ముందు తెలుగు భాషా సాహిత్యాలున్నాయి. మౌఖిక సాహిత్యం ఎక్కువగా ఉంది. శాసన కవిత వాడుకలో ఉంది. తెలుగు భాష జన వ్యవహారంలో బాగా ఉంది. అయితే గ్రంథ రచనాభాష రూపొందలేదనవచ్చును. అలా రూపొందడానికి అనువైన పరిస్థితులు లేవు. సంస్కృత ప్రాకృతాలపై గల మమకారమే అందుకు కారణం కావచ్చును.
ప్రాజ్ఞనన్నయ యుగం అధ్యాయాన్ని ముగిస్తూ, నన్నయ యుగ రచనకు నాందిగా కాళ్ళకూరు నారాయణరావు ఇలా వ్రాశాడు [2] – “సుప్రసిద్ధ వాఙ్మయమింకను గన్పడలేదు. చిక్కనిదానికై యంధకారములో తడవులాడుటకంటె, చెవులకింపుగా తెలుగు భారతమును “శ్రీవాణీ”యని మొదలు పెట్టి గోదావరీ తీర రాజమహేంద్రమున, రాజరాజు సన్నిధిని, పాడుచున్న ప్రసిద్ధాంధ్ర కావ్యకవి “నన్నియభట్టు”ను చూతముగాక రండు.” (నందంపూడి శాసనంలో ‘నన్నియభట్టు’ అని ఉంది).
కనుక మహాభారతాన్నే ఆదికావ్యంగాను, నన్నయను ఆదికవిగాను మన్నించడం తెలుగు సాహిత్యంలో నెలకొన్న సంప్రదాయం.

ఆంధ్ర మహాభారత ప్రశస్తి

ఆంధ్ర మహాభారతం తెలుగు సాహిత్యానికి ప్రాణం వంటిది. ఇది ఆది కావ్యమే కాదు. తెలుగు వారికి అమర కావ్యం కూడాను. “తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి.” అన్న సూక్తి జనబాహుళ్యమైనది కవిత్రయం కృషివల్లనే. నన్నయ, తిక్కన, ఎఱ్ఱనాదులను గురించి ఎన్నో కధలు ప్రచారంలో ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో వ్యాకరణానికి, నిఘంటువులకు, సూక్తులకు, జనప్రియ గాధలకు, కవిత్వ స్ఫూర్తికి ఇది పుట్టినిల్లు.

నన్నయ ఆది పర్వాన్ని, సభాపర్వాన్ని, అరణ్యపర్వంలో కొంత భాగాన్ని 1054-1061 మధ్య కాలంలో రచించి దివంగతుడైనాడు. తరువాత 13వశతాబ్దంలో తిక్కన అరణ్యపర్వం శేషాన్ని వదలి, విరాట పర్వంనుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించాడు. ఆ తరువాత 14వశతాబ్దంలో ఎర్రన అరణ్యపర్వ శేషాన్ని పూరించాడు. ఇలా ఈ ముగ్గురు యుగ కవులూ కవిత్రయం అనే పేరుతో తెలు సాహిత్యకారులకు పూజనీయులయ్యారు. ఈ విధంగా రెండున్నర శతాబ్దాల కాలంలో ముగ్గురు కవులు రచించినా ఆంధ్ర మహాభారతం ఏకకాలంలో ఒకే మహాకవి రచించిన కావ్యాన్ని చదివిన మహానుభూతిని అందించడం ఆంధ్రావళి అదృష్టం. సంస్కృత మహాభారతం నూరు పర్వాల గ్రంధమనీ, లక్ష శ్లోకాల విస్తృతి కలిగి ఉందనీ ప్రసిద్ధి. ఆది పర్వంలో నన్నయ చెప్పిన పర్వానుక్రమణిక కూడా ఈ విషయానికి దగ్గరగానే ఉంది. ముఖ్య పర్వాలు, ఉపపర్వాలు కలిపి నూరు ఉన్నాయి. అందులో హరివంశ పర్వం భవిష్య పర్వంలో కలిసి ఉన్నది. ఈ రెంటినీ కలిపి ఖిలవంశ పురాణమనే స్వతంత్ర గ్రంధంగా పరిగణిస్తారు. నన్నయ తన పర్వానుక్రమణికలో హరివంశాన్ని చేర్చలేదు. తన అష్టాదశ పర్వ విభక్తంలో నూరు పర్వాలను అమర్చాడు. ఉపపర్వ విభాగాన్ని తెలుగులో పాటించలేదు. తిక్కనాదులు నన్నయ నిర్ణయాన్ని అనుసరించారు. ఎఱ్ఱన హరివంశాన్ని వేరే గ్రంధంగా రచించాడు. ఈ విధంగా నూరు ఉపపర్వాల సంస్కృత మహాభారతం తెలుగులో పదునెనిమిది పర్వాల ఆంధ్ర మహాభారతంగా రూపు దిద్దుకొంది. తెలుగులో ఆశ్వాసాలుగా విభజించారు.ఆ విభజన క్రింది పట్టికలో చూడవచ్చును.[5]

పర్వం ఉపపర్వాల సంఖ్య సంస్కృత భారతంలో
శ్లోకాల సంఖ్య
ఆంధ్ర భారతంలో
ఆశ్వాసాల సంఖ్య
పద్య గద్య సంఖ్య
1. ఆదిపర్వం 18 9,984 8 2,084
2. సభాపర్వం 9 4,311 2 618
3. అరణ్యపర్వం 16 13,664 7 2,894
4. విరాటపర్వం 4 3,500 5 1,624
5. ఉద్యోగపర్వం 11 6,998 4 1,562
6. భీష్మపర్వం 5 5,884 3 1,171
7. ద్రోణపర్వం 8 10,919 5 1,860
8. కర్ణపర్వం 1 4,900 3 1,124
9. శల్యపర్వం 4 3,220 2 827
10. సౌప్తికపర్వం 3 2,874 2 376
11. స్త్రీపర్వం 5 1,775 2 376
12.శాంతిపర్వం 4 14,525 6 3,093
13. ఆనుశాసనికపర్వం 2 12,000 5 2,148
14. అశ్వమేధ పర్వం 2 4,420 4 976
15. ఆశ్రమవాస పర్వం 3 1,106 2 362
16. మౌసల పర్వం 1 300 1 226
17. మహాప్రస్థానిక పర్వం 1 120 1 79
18. స్వర్గారోహణ పర్వం 1 200 1 97
19. హరివంశ పర్వం, భవిష్య పర్వం 2 (వదలబడినవి)
మొత్తం 100 1,00,500 63 21,507

వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదం చెయ్యలేదు. శ్లోకానికి పద్యము అన్న పద్ధతి పెట్టుకోలేదు. భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే మార్గంలో అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనేమి రసవద్ఘట్టాలలోనేమి అనువక్త ఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించడం, పాఠకులు అందరికీ అవే ఎక్కువ నచ్చడం గమనించవలసిన అంశం. భారతంలో కొన్ని ఉపాఖ్యానాలు కావ్యాలుగా విరాజిల్లడం “ప్రబంధమండలి” అనిపించుకోవడం వెనక దాగి ఉన్న రహస్యం ఇదే.[6]
కవిత్రయం తెలుగువారికి ప్రసాదించిన ఆంధ్రమహాభారతం వ్యాసుని సంస్కృతమూలానికి అనువాదం కాదు. అనుసృజనం. పునసృష్టి . [5]. నన్నయ చూపిన మార్గంలోనే ఇతర కవులూ కధనంలోను, కధలోను మూలానికి భంగం కలుగకుండా, క్రొత్త అందాలు సంతరించి దానిని ఒక మహాకావ్యంగా తీర్చిదిద్దారు. ఈ పునస్సృష్టి విశిష్టతను అనేక సాహితీకారులు పరిశోధించారు. అందుకు నిరూపణగా చెప్పబడిన కొన్ని అంశాలు –

 1. మూలంలోని హరివంశాన్ని తెలుగు భారతంలో కలుపలేదు.ఇలా భారత గాధను తెలుగులో పాండవనాయకంగా మలచారు.
 2. వ్యాసమహర్షి రచనలో శాస్త్రప్రతిపాదనా దృక్ధం, ప్రబోధ ప్రవృత్తీ ప్రముఖంగా ఉన్నాయి. కావ్యస్పృహ తక్కువ. అయితే తెలుగు భారతం ప్రధానంగా కావ్యేతిహాసం. “కావ్యరూప శాస్త్ర ఛాయాన్వయి”.
 3. వ్యాస భారతంలో శాంతరసం ప్రధానంగా ఉంది. తెలుగుభారతం ధర్మ వీర రస సమన్వితం. రస సమన్వయ రూపకం.
 4. వేదం శబ్ద ప్రధానం. ఇతిహాస పురాణాలు అర్ధ ప్రధానాలు. వ్యాస భారతం అర్ధ ప్రధానమైన శాస్త్రేతిహాసం. కవిత్రయ భారతం ఉభయ ప్రధానమైన కావ్యేతిహాసం.
 5. వ్యాసుని శ్లోక రచనా శైలికంటె నన్నయ పద్య రచనాశైలి విశిష్టమైనది, రస వ్యంజకమైనది. అనంతర కవులు నన్నయనే అనుసరించారు.
 6. కవిత్రయం యధానువాదంచేయలేదు. స్వతంత్రానువాదంచేశారు. కధను మార్చలేదు. కాని కొన్ని వర్ణనలను తగ్గించాఱు. కొన్నింటిని పెంచారు. కొన్ని భాగాలను సంక్షిప్తీకరించారు.

కవిత్రయంలో ముగ్గురు మహాకవులూ తెలుగు సాహితీ చరిత్రలో ఆయా యుగాలకు ప్రధాన దీపస్తంభాలుగా ఆదరణీయులయ్యారు. వారిలో ఒక్కొక్కరు కొన్ని ప్రత్యేక రచనా నైపుణ్యాలకు ప్రసిద్ధులయ్యారు

నన్నయ

నన్నయ శైలిలో ప్రధానంగా పరిగణింపబడిన అంశాలు నన్నయయే ఇలా చెప్పుకొన్నాడు

 • ప్రసన్న కధా కలి(వి)తార్ధ యుక్తి
 • అక్షర రమ్యత
 • నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం
తిక్కన

తిక్కన శైలిలో ముఖ్యాంశాలు –

 • ప్రక్రియా వైచిత్రి – హరిహరనాథ తత్వదర్శనం, ఉభయ కవిత్వ తత్వ విచారం
 • నాటకీయత, సన్నివేశరంగాలు, సంభాషణా శిల్పాలు
 • పాత్రోచిత, సందర్భోచిత, రసోచిత సంభాషణలు
 • యుద్ధ ఘట్టాల వర్ణనలో అసాధారణ నైపుణ్యం
 • అలంకార శిల్పం

“తిక్కన శిల్పపుఁ ధెనుఁగు తోఁట” అని విశ్వనాధ సత్యనారాయణ కీర్తించాడు. “తెనుంగుల జాతులేర్పడన్ తిక్కన విధాత శబ్ద సంతానాన్ని ఏలాడు” అని రాయప్రోలు సుబ్బారావు అన్నాడు. “అచ్చ తెనుఁగు భాష సూక్ష్మాతిసూక్ష్మములైన మనోభావములను వ్యక్తము చేయుట యందును, అతి గంభీరములైన శాస్త్ర పరమార్ధములను నిష్కర్షగా వివరించుట యందును కూడ సమర్ధమే అని తన ప్రయోగములచే లోకమునకు చూపినవాడు తిక్కన…. వ్యావహారి భాషా పదములకే శుద్ధరూపమును, క్రొత్త ప్రాణమును ఇచ్చి ఆయన భారతమును రచించెను.” అని పింగళి లక్ష్మీకాంతం అన్నాడు.

ఎఱ్ఱన

నన్నయ, తిక్కన లు పన్నిన హారం రెండు భాగాలను మధ్యన తన అరణ్యపర్వశేషరచన అనే మణితో అనుసంధానించాడట ఎఱ్ఱన. వినయం, వర్ణనా కౌశలం ఎఱ్ఱన రచనలో ముఖ్యమైనవి.

 • ప్రబంధ శైలి
 • మంజుల వాగమృత ప్రవాహం
 • చతురోక్తులు, మధురోక్తులు, హృద్యోక్తుల సమాహారం

“ఎఱ్ఱన మహాకవి రచన నన్నయ, తిక్కనల త్రోవలను తప్పిపోవక అటనట వర్ణనలు కధాభావములందు ప్రవసింపగా సరళముగా, శిథిల మధురమగు నడకతో మాఘమాసపు సరస్వతీ ప్రసన్నతతో మృదువుగా చదువరులను ఆకర్షించును” – అని శిరోమణి వేదాల తిరువేంగళాచార్యులు అన్నాడు.

 

మహా భారతము

Filed under: కవులు,రచయితలు ,వారి రచనలు — telugubashasahityam @ 11:25 సా.

మహాభారతం పంచమ వేదము గా పరిగణించబడే భారత ఇతిహాసము. ఈ మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు.

వ్యాసుడు చెప్పగా వినాయకుడు మహాభారతాన్ని వ్రాశాడని పురాణ కధనం

కావ్య ప్రశస్తి

యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్” – “ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు” అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును.

ఈ కావ్యవైభవాన్ని నన్నయ ఇలా చెప్పాడు:

“ దీనిని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు. “

విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు.

మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం చేయించేటపుడు జనమేజయ మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.
మహాభారతాన్ని చెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది

మహాభారతంలోని విభాగాలు

మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది:

 1. ఆది పర్వము: 1-19 ఉపపర్వాలు – పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.
 2. సభా పర్వము: 20-28 ఉపపర్వాలు – కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
 3. వన పర్వము (లేక) అరణ్య పర్వము: 29-44 ఉపపర్వాలు – అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
 4. విరాట పర్వము: 45-48 ఉపపర్వాలు – విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
 5. ఉద్యోగ పర్వము: 49-59 ఉపపర్వాలు – కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
 6. భీష్మ పర్వము: 60-64 ఉపపర్వాలు – భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
 7. ద్రోణ పర్వము 65-72 ఉపపర్వాలు – ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
 8. కర్ణ పర్వము: 73 వ ఉపపర్వము – కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
 9. శల్య పర్వము: 74-77 ఉపపర్వాలు – శల్యుడు సారథిగా సాగిన యుద్ధం.
 10. సౌప్తిక పర్వము: 78-80 ఉపపర్వాలు – నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
 11. స్త్రీ పర్వము: 81-85 ఉపపర్వాలు – గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.
 12. శాంతి పర్వము: 86-88 ఉపపర్వాలు – యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
 13. అనుశాసనిక పర్వము: 89-90 ఉపపర్వాలు – భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
 14. అశ్వమేధ పర్వము: 91-92 ఉపపర్వాలు – యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
 15. ఆశ్రమవాస పర్వము: 93-95 ఉపపర్వాలు – ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
 16. మౌసల పర్వము: 96వ ఉపపర్వం – యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
 17. మహాప్రస్ధానిక పర్వము: 97వ ఉపపర్వం – పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
 18. స్వర్గారోహణ పర్వము:98వ ఉపపర్వం – పాండవులు స్వర్గాన్ని చేరడం.

హరివంశ పర్వము: శ్రీకృష్ణుని జీవితగాథ వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు.

కురు వంశవృక్షం

 • : కురు మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన పూర్వీకుడు కురుకు కొన్ని తరాల తరువాతి రాజు, శంతనుడు. సత్యవతిని పెళ్ళాడే ముందు అతడు గంగను పెడ్లాడాడు.
 • : విచిత్రవీర్యుని మరణం తరువాత, వ్యాసుని వలన ధృతరాష్ట్రుడు, పాండు రాజు జన్మించారు.
 • : కుంతి వివాహానికి ముందే సూర్యుని వరం చేత ఆమెకు కర్ణుడు జన్మించాడు.
 • : పాండవులు పాండు రాజు పుత్రులైనప్పటికీ, దేవతల వరం చేత కుంతి, మాద్రిలకు వీరు కలిగారు. ఆ వివరాలు:
 • : దుర్యోధనుడు, అతని శతసోదరులు ఒకేసారి జన్మించారు.
 • తెలుగు సినిమాలలో భారతగాథ

  మహాభారత కథ ఇతివృత్తంగా ఎన్నో తెలుగు సినిమాలు వెలువడ్డాయి. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో తెలుగువారికున్న నైపుణ్యం కారణంగా వాటిలో చాలా సినిమాలు చిరస్థాయిగా జనాదరణ పొందాయి. వాటిలో కొన్ని:

   

  బమ్మెర పోతన

  Filed under: కవులు,రచయితలు ,వారి రచనలు — telugubashasahityam @ 11:13 సా.

  బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరి భాగవతము తో తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసినాడు. భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి వరంగల్ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించినారు[ఆధారం కోరబడినది]. శ్రీ రాముని ఆజ్ఞపై శ్రీ కృష్ణుని కథ, విష్ణు భక్తుల కథలు ఉన్న భాగవతమును తెలుగించినారు. ఈ భాగవతము మొత్తము తెలుగు తనము ఉట్టిపడుతుంది. వీరభద్ర విజయము, భోగినీ దండకము వీరి ఇతర రచనలు.
  పోతన, శ్రీనాధ కవిసార్వభౌముడు సమకాలికులు, బంధువులు అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది కానీ ఈ సిద్ధాంతం నిజం కాదనే వారూ ఉన్నారు. వీరిమధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాధలు ప్రచారములో ఉన్నాయి. పోతన వ్యవసాయము చేసి జీవనము సాగించినవారు. “పట్టునది కలమొ, హలమొ – సేయునది పద్యమో, సేద్యమో” అని “కరుణశ్రీ” జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చమత్కరించిరి. కవిత్వమును రాజులకో, కలిగినవారికో అంకితమిచ్చి, వారిచ్చిన సొమ్ములు, సన్మానములు స్వీకరించుట అప్పటి సంప్రదాయము. కాసు కోసము ఆసపడి తన “బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకను” క్రూరులైన రాజుల పరము జేయుటకు పోతన అంగీకరింపలేదు. ఆయన తన కవిత్వము శ్రీరామునకే అంకితము చేసిన పరమ భాగవతోత్తములు.

  పోతన కవిత్వములో భక్తి, మాధుర్యము, తెలుగుతనము, పాండిత్యము, వినయము కలగలిపి ఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది ఎలా చూచినా అతిశయోక్తి కానేరదు. భావి కవులకు శుభము పలికి రచన ఆరంభించిన సుగుణశీలి ఆయన.

  డా. సి.నారాయణరెడ్డి గారి వ్యాసము భక్తి కవితా చతురానన బమ్మెర పోతన తెలుగు సాహిత్యములో పోతనగారి విశేష స్థానాన్ని వివరిస్తుంది.

  వీరి భాగవతము నుండి మచ్చుకి కొన్ని పద్యాలు

  ఆయన సంకల్పాన్ని, వినయాన్ని, భక్తిని చాటే పద్యములు….

  పలికెడిది భాగవతమట
  పలికెంచెడువాడు రామ భద్రుండట, నే
  పలికిన భవహరమగునట
  పలికెద వేరొండు గాధ పలుకగనేలా

   

  చిత్రంబులు, త్రైలోక్య ప
  విత్రంబులు, భవలతా లవిత్రంబులు, స
  న్మిత్రంబులు, ముని జనవన
  చైత్రంబులు, విష్ణుదేవ చారిత్రంబుల్

  బృందావనములో గోపాలుని వెదుకుచున్న గోపకాంతల తాపత్రయము…..

  నల్లని వాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పై
  జల్లెడువాడు, మౌళిపరిసర్పిత పింఛమువాడు, నవ్వురా
  జిల్లెడుమోమువా డొకడు ెల్వల మానధనంబు దెచ్చె నో
  మల్లియలార మీ పొదలమాటున లేడుగదమ్మ, చెప్పరే?

   

  మామా వలువలు ముట్టకు
  మామా కొనిపోకు పోకు మన్నింపు తగన్
  మా మాన మేలకొనియెదు
  మా మానసహరణ మేల మానుము కృష్ణా:

   

  పున్నాగ: కానవే పున్నాగ వందితు, తిలకంబ: కానవే తిలకనిటలు
  ఘనశర: కానవే ఘనసారశోభితు, బంధూక: కానవే బంధుమిత్రు
  మన్మథ: కానవే మన్మథాకారుని, వంశంబ: కానవే వంశధరుని
  చందన: కానవే చందన శీతలు, కుందంబ: కానవే కుందరను

  మొసలిబారి చిక్కిన గజేంద్రుడు ఆపన్నశరణుని వేడుకొన్న విధము… దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు ఈ పద్యము చక్కని సమాధానము. అన్ని మతములవారికి సరిపోగలదు.

  ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
  యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
  బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
  డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

   

  లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
  ఠావుల్ దప్పెను; మూర్చ వచ్చె; దనువున్ డప్పెన్; శ్రమబయ్యెడిన్;
  నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;
  రావె ఈశ్వర; కావవె వరద; సంరక్షింపు భద్రాత్మకా;

  గజరాజును కాచుటకు తొందరపడుచున్న శ్రీ మహా విష్ణువు ఆర్తజనరక్షణా తత్వము ఇలా ఉన్నది.

  సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
  పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
  తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
  పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.

   

  తనవెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దాని వె
  న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధను:కౌమోదకీ శంఖ చ
  క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండు రా వచ్చిరొ
  య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.

   

  గోపాలుని ఆగడాలగురించి గోపకాంతలు యశోదమ్మకు పిర్యాదు చేస్తున్నారు……

  పడతీ: నీ బిడ్డడు మా
  కడవలలో నున్న మంచి కాగిన పా లా
  పడుచులకు బోసి చిక్కిన
  కడవలబో నడిచె నాఙ్న గలదో లేదో?

   

  ఓ యమ్మ నీ కూమరుడు
  మాఇంటి పాలు పెరుగు మననీ డమ్మా
  పోయదము ఏక్కడి కైనను
  మాయనెన్నల సొరబులాన మంజుల వాణి

  మన్ను తిన్నావా? కన్నా? అని తల్లి యశోద గద్దించినది. లేదమ్మా అని బాలకృష్ణుడు నోరు తెరచి చూపెను. ఆ లీలామానుషుని నోట యశోదమ్మ సకల భువనములను చూచి అబ్బురపడినది………..

  కలయో!వైష్ణవమాయయో! ఇతర సంకల్పార్ధమోసత్యమో
  తలపన్ నేరక యున్నదాననొ: యశోదాదేవి గానో! పర
  స్థలమో! బాలకుడెంతయీతనిముఖస్తంబైయజాండంబు ప్ర
  జ్వలమైన్ యుండుట కేమిహేతువో! మహాశ్చర్యంబు చింతింపగన్

  నీ హరి యెక్కడున్నాడని గద్దించిన హిరణ్య కశిపునకు భక్తప్రహ్లాదుదిచ్చిన సమాధానము……

  ఇందు గలడందు లేడను
  సందేహంబు వలదు చక్రి సర్వోపగతున్
  డెందెందు వెదెకి చూసిన
  అందందే కలడు దానవాగ్రణి కంటే!

  రుక్మిణి కళ్యాణం నుంచి…..

  శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహము పాలి సొమ్ము గో
  మాయువు గోరుచందమున మత్తుడు చైద్యు॰డు నీ పదాంబుజ
  ధాయిని యైన నన్ను వడి॰ దా॰ గొనిపోయెద నంచు నున్నవా॰
  డా యధమాధముం డెఱుగ॰డద్బుత మైన భవత్ప్రతపముల్

   

  ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణంధ్రబుల కలిమి యేల
  పురుషరత్నమ! నీవు భోగింప॰గా లేని తనులతవలని సౌందర్యమేల
  భువనమోహన! నిన్ను॰ బొడగాన॰గా లేని చక్షురిద్రియముల సత్త్వమేల
  దయిత! నీ యధరామృతం బాన॰గా లేని జిహ్వకు ఫలరససిద్ది యేల

   

  నీరజాతనయన! నీ వనమాలికా
  గంధ మబ్బలేని ఘ్రాణ మేల
  ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
  జన్మమేల యెన్ని జన్మములకు
  వచ్చెద విదర్భభూమికి॰
  జొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్
  దెచ్చెద బాలన్ వ్రేల్మిడి
  వ్రచ్చెద నడ్డంబు రిపులువచ్చిన॰ బోరన్.

   

  ఘను॰డా భూసురు॰డేగెనో నడుమ మార్గశ్రాంతు॰డై చిక్కెనో
  విని కృష్ణుండిది తప్పుగా దల॰చెనో విచ్చేయునో యీశ్వరుం
  డనుకూలింప॰ దలంచునో తలప॰డో యార్యా మహాదేవియున్
  నను రక్షింప నేఱుంగదో నా భాగ్య మేట్లున్నదో.

   

  నమ్మితి నా మనంబున సనాతనులైన యుమా మహేశులన్
  మిమ్ము॰ బురాణదంపతుల మేలు భజింతు॰ గదమ్మ!మేటి పె
  ద్దమ్మ!దయాంబురాశివి గదమ్మ! హరం బతిసేయుమమ్మ! నిన్
  నమ్మిన వారి కెన్న॰టికి నశము లేదు గదమ్మ! యీశ్వరీ!

   

  ధ్రువ కీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
  భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం
  ధవ సత్కారిణి॰ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
  సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణి॰ రుక్మిణిన్

  పూతన సమ్హారము పిమ్మట..

  విషధరరిపు గమనునికిని
  విషగళ సఖునికి విమల విషశయనునికిన్
  విషభవభవ జనకునికిని
  విషకుచ చనువిషము గొనుట విషమే తలపన్
   

  మారన

  Filed under: కవులు,రచయితలు ,వారి రచనలు — telugubashasahityam @ 11:00 సా.

  మారన (ఆంగ్లము: Marana) తిక్కన శిష్యుడు, తెలుగులో తొలి పురాణమును అనువదించిన కవి.

  ఇతను తన గ్రంథాన్ని కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని అయిన గన్నయనాయకునికి (మాలిక్ మక్బూల్) అంకితమిచ్చినాడు. ప్రతాపరుద్రుడు క్రీ.శ.1295 నుండి క్రీ.శ.1326వరకూ పరిపాలించినాడు. మారన కూడా ఆకాలం వాడే

  మార్కండేయ పురాణం, 2547 గద్యపద్యాలుగా రచించినాడు.

  ఇతని ప్రాంతమును పూర్తిగా నిర్ధారించడానికి సరి అయిన ఆధారాలు లభించలేదు, కానీ ఆరుద్ర గారు మాత్రం తెలంగాణా ప్రాంతపు గోదావరి నదీ తీరం వాడని ఇతని రచనలోని ఓ పద్యాన్ని బట్టి ఊహించారు.

   

  కేతన

  Filed under: కవులు,రచయితలు ,వారి రచనలు — telugubashasahityam @ 10:59 సా.

  మూలఘటిక కేతన లేదా కేతన (1200-1280) తిక్కన యుగానికి చెందిన తెలుగు కవి. తిక్కన కాలానికి చెందిన కవులలో కేతన ప్రసిద్ధుడు. ఇతని తండ్రి “మారయ”, తల్లి “సంకమాంబ”. కేతన కొంతకాలం “వెంటిరాల” గ్రామానికి గ్రామాధికారిగా ఉండేవాడు. తరువాతి కాలంలో నెల్లూరుకు వలస వెళ్ళాడు. అక్కడ అతనికి మహాకవి తిక్కనతో పరిచయం ఏర్పడింది.

  కేతన రచనలు
  • దశకుమార చరిత్ర : ఇది సంస్కృతంలో మహాకవి దండి వ్రాసిన వచన రచన “దశకుమార చరిత్ర”కు తెలుగు పద్యానువాదం. ఇందులో పది మంది యువకుల సాహస, ప్రేమ గాధలను కవి చక్కనైన పద్యాలలో వర్ణించాడు. ఇది 12 అధ్యాయాలు, 1625 పద్యాలు ఉన్న కావ్యం. ఇందులో కేతన ఆనాటి సంఘం స్వరూపాన్ని, ఆచారాలను. ఆభరణాలను వర్ణించాడు. సంస్కృత మూలంలో లేని పెక్కు సంప్రదాయాల వర్ణన ఈ కావ్యంలో కేతన పొందుపరచాడు. ఆంధ్ర ప్రాంతపు “కోడి పందేలాట” ను కూడా కేతన వర్ణించాడు.
  • ఆంధ్ర భాషా భూషణము : ఇది తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణ గ్రంధం కావచ్చును. ఇందులో 196 పద్యాలున్నాయి. “తెలుగు”, “తెనుగు” అనే రెండు పదాలను కేతన వాడాడు. తెలుగు భాష సంస్కృత భవం కాదని, స్వతంత్ర భాష అని కేతన అభిప్రాయపడ్డాడు.
  • విజ్ఞానేశ్వరము : యాజ్ఞవల్క్య స్మృతి ఆధారంగా సంస్కృతంలో విన్యానేశ్వరుడు వ్రాసిన “మితాక్షరి” అనే న్యాయశాస్త్ర గ్రంధానికి ఇది తెలుగు సేత. ఇందులో మూడు అధ్యాయాలు, 433 పద్యాలు ఉన్నాయి. ఇది తెలుగులో మొట్టమొదటి న్యాయశాస్త్ర గ్రంధఁ కావచ్చును. ఈ గ్రంధం ద్వారా అప్పటి ఆచారాలు, నియమాలు, జీవిత పరిస్థితులు కొంతవరకు తెలుస్తున్నాయి.